Friday, January 8, 2010
జీతాలు పొందడమే కాదు... వైద్యసేవలందించాలి
నెల్లూరు, మేజర్‌న్యూస్: జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో అధికారులు, సిబ్బంది నెలకు రూ.80 లక్షల మేర జీతాలు పొందుతున్నారని, అయితే కొంతమంది వైద్య, మినిస్టీరియల్ సిబ్బంది విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో రోగులకు వైద్యసేవలు అందించడంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆయన వివిధ వైద్యసేవల విభాగాలను సంద ర్శించి సంబంధిత రిజిష్టర్లను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందజేశారు.రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో వైద్యసిబ్బందితో పాటు మినిస్టీరియల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. కొంతమంది ఇక్కడే ఉద్యోగంలో చేరి, ఇక్కడే పదోన్నతులు పొంది దాదాపు 15 ఏళ్లకు పైగా ఒకే స్థానంలో ఉండడంతో వారు విధులలో శ్రద్ధ వహించకుండా ఉదాసీనత చూపడం విచారకరమన్నారు. అలాంటి సిబ్బందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా రోగులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం వెచ్చించి నిలబడి అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటివి జరగకుండా నిర్దేశిత సమయాన్ని కేటాయించి అందుకు అనుగుణంగా సిబ్బందికి విధులు కేటాయించాలని ఆదే శించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ఒకే వ్యక్తికి పనిభారం లేకుండా, ఉన్న సిబ్బందికి తగిన విధులను కేటాయించి సరళతరంగా చేయాలన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మాసిస్టులు, నర్సింగ్ సిబ్బంది, ఇతరులు విధులపై ప్రతిరోజూ పర్యవేక్షించి సక్రమంగా నిర్వర్తించేలా చూడాలన్నారు. సంబంధిత రిజిష్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఆసుపత్రిలో పాడైపోయిన ఫర్నిచర్, తదితర పరికరాలను వెంటనే వేలం వేసి సంబంధిత నివేదికలను అందజేయాలన్నారు. ప్రధానంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సకాలంలో అవసరమైన మందులు పంపిణీ చేయడంలో శ్రద్ధ వ హించాలన్నారు. ప్రతి రోజూ హెచ్‌ఐవిపై పరీక్షలు చేయించుకున్నవారి పేర్లను, ఫోన్ నెంబర్లను కంప్యూటర్‌లో నమోదు చేయాలన్నారు. ఒకవేళ హెచ్‌ఐవి సోకినవారికి అవసరమైన మందులు క్రమం తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. ఆయన ముందుగా హెచ్‌ఐవి ఎయిడ్స్ చికిత్సా కేంద్రాన్ని సందర్శించి ఎయిడ్స్ రోగులకు అందిస్తున్న మందుల పంపిణీ రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ ఛైర్మన్ టివిఎస్.రాజా, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చెన్నయ్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.పెంచలయ్య, ఆర్‌ఎంఒ డాక్టర్ జూలియానా, రక్తనిధి ఇన్‌చార్జ్ డాక్టర్ బి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment