కోవూరు : నేటితో కోవూరు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. నెల రోజుల నుంచి జరుగుతున్న బహిరంగ ప్రచారం శుక్రవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఈనెల 18న జరగనున్న ఎన్నికలకు తెర వెనుక నుంచి రాజకీయం నడపడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా టిడిపి, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వారు ఉవ్విళూరుతున్నారు. సిపిఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు, తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు, జక్కావెంకయ్య ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి వెంకమరాజు నియోజకవర్గమంతా కలియతిరిగారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మూడు దఫాలు నియోజకవర్గంలో పర్యటించి కేడర్‌లో నూతనోత్సాహం నింపారు. ఆయన ప్రచారంతో ఆ పార్టీ అభ్యర్థి సోమిరెడ్డిచంద్రమోహన్‌రెడ్డి, ఇతర నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. బాబు పర్యటనకు మంచి స్పందన లభించడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి తరపున 8 రోజులు నుంచి జగన్ ప్రచారం చేశారు. అయితే ఓదార్పు యాత్రకు వచ్చిన స్పందన ఈ ప్రచారంలో కనిపించలేదు. కొన్నిచోట్ల జనం పలుచగా ఉండడంతో తొలుత గెలుపుపై ధీమాగా ఉన్న ఆపార్టీ నేడు నీరసపడింది. గెలుపుకోసం ఉన్న అవకాశాలను అన్నింటినీ వెతుకుతుంది. డబ్బు, మద్యం, యువతకు స్పోర్ట్స్ కిట్లు అందించి ఓట్లు పొందాలని నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కఓటుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారని ప్రచారంలో ఉంది. కాని ఓటరు చేతికి రెండు వందల రూపాయలు అందుతుండడంతో వారిలో అసంతృప్తి నెలకొంది.
కాంగ్రెస్‌పార్టీ ప్రచారంలోనూ వెనుకబడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోవూరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను మండలాలకు ఇన్‌ఛార్జిలుగా నియమించారు. వారు ఎక్కడా ప్రచారంలో కనిపించడంలేదు. అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెనుకే జనం లేని పరిస్థితి. కాంగ్రెస్‌పార్టీ కున్న సాంప్రదాయ ఓటింగ్ మాత్రమే దాని ఆయుధంగా ఉంది. మరోవైపు మాజీ ఐపిఎస్ అధికారి పట్టపురవి, లోక్‌సత్తా అభ్యర్థి కూడా నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. లోక్‌సత్తా తరపున జయప్రకాశ్‌నారాయణ రెండు రోజులు నియోజకవర్గంలో పర్యటించారు. బహిరంగ ప్రచారాలు నేటి సాయంత్రంతో తెర పడనుండడంతో తెర వెనుక రాజకీయాలకు నేతలు సిద్ధమవుతున్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. తనిఖీలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. అధికారపార్టీ ముఖ్య నాయకులు వస్తే కనీసం తనిఖీలు చేయకుండానే వదిలేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి మద్యం, డబ్బు వచ్చి చేరింది. 18వ తేదీ జరిగే పోలింగ్‌కు జిల్లా అధికారయంత్రాంగం అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడికక్కడే గెలుపు తమదేనని ఆయా పార్టీల నాయకులు మేకపోతు గాంభీర్యంతో ఉన్నా ఓటర్లు మాత్రం మౌనం వీడడం లేదు.
No comments:
Post a Comment