కోవూరు : సామాజిక న్యాయం జరిగే వరకు పేదల పక్షమై పోరాడుతానని సినీ నటుడు, కాంగ్రెస్ నేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి స్పష్టం చేశారు. కోవూరు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సభల్లో చిరంజీవి మాట్లాడుతూ సామాజిక అభివృద్ధి కోసమే పీఆర్పీని స్థాపించానని, రాజకీయ పార్టీల కుయుక్తులతో విజయం సాధించలేకపోయానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనమై బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానన్నారు. ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని, అయితే అధికార దాహంతో సీఎం పదవిపై కన్నేసిన జగన్ రాష్ట్ర రాజకీయాలను అస్తవ్యస్తం చేస్తున్నాడని విమర్శించారు.
ఐదేళ్లపాటు అధికారంలో ఉండాలని అవకాశం ఇచ్చిన ప్రజలను అవమానించేలా పదవికి రాజీనామా చేసిన ప్రసన్నకు తిరిగి ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ అదే పని చేస్తాడన్నారు. అభివృద్ధి పథకాలు ఆగాయాంటూ జగన్ తన సొంత మీడియాలో అసత్య ప్రచారాలు సాగిస్తున్నాడని విమర్శించారు. ఓటు విలువ తెలియజేసే విధంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు. గతంలో ఓ గిరిజన మహిళకు పార్టీ టికెట్ ఇస్తే కోవూరు ప్రజలు పాతికవేల ఓట్లు వేశారని గుర్తు చేశారు. అదే కాంగ్రెస్‌తో జత కలిసి ఉంటే గెలుపు కాంగ్రెస్‌దేనని చెప్పారు. జిల్లాలో రూ. 100 కోట్లతో చేపడుతున్న పెన్నా, సంగం బ్యారేజీ పనులను ఏడాదిలోగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.
మత్స్యకారులకు రూ. 4వేలు పరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీ ఆదేశాలు, ప్రజాభిమానం పొందిన తరువాతే సీఎం పదవి దక్కిందన్నారు. రానున్న రెండేళ్లలో అభివృద్థి పథకాలు మరింతగా ప్రజల ముంగిటకు తీసుకుపోతామన్నారు.
No comments:
Post a Comment