నెల్లూరు: అందరి కళ్లూ కోవూరు నియోజకవర్గంపైనే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉప ఎన్నిక కావడం వల్లనే కోవూరుపై ఆసక్తి నెలకొని ఉంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్ట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు బరిలో ఉన్నా వారిద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రసన్నకుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తాయా అనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ, వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానం ముందు వైయస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టుకుపోతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. పైగా, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయి జగన్‌ను వేధిస్తున్నాయనే అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా ఉందని వారంటున్నారు.
అయితే, తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన మరో విధంగా ఉంది. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తున్నారని, డిఎంకె, బిఎస్పీలను ప్రజలు తిరస్కరించడమే ఇందుకు ఉదాహరణ అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిస్తే రానున్న 17 స్థానాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఊపు వస్తుంది. ఈ ఫలితాన్ని బట్టి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతుందని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశేతర రాష్ట్రాల నాయకులు కూడా కోవూరు ఫలితాల కోసం, తెలంగాణలోని ఏడు స్థానాల ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం జాతీయ స్థాయిలో ఏర్పడబోయే జాతీయ స్థాయిలో ఏర్పడబోయే తృతీయ కూటమిపై కూడా ఉంటుందని అంటున్నారు. అందుకే, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డుతోంది.
కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అయితే, కోవూరు మాత్రం జగన్ రాజకీయాలకే అగ్ని పరీక్ష పెడుతుంది.
No comments:
Post a Comment