నెల్లూరు: నగరంలో పట్టపగలు అందరూ తిరుగాడే సమయంలోనే పోలీసులమంటూ చెప్పి ఓ వృద్ధురాలిని దారిదోపిడీ చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక అయ్యప్పగుడి సమీపంలో జరిగిన ఈ దోపిడీలో బాలాజీనగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి భార్య రంగమ్మ అనే వృద్ధురాలు సుమారు 5 సవర్ల బంగారు పోగొట్టుకుంది. రంగమ్మకు అయ్యప్పపై విపరీతమైన భక్తి ఉండడంతో ఇంతవరకు ఆమె 25 సార్లు శబరిమలైకు వెళ్లి వచ్చింది. అయ్యప్పమీద భక్తితో నగరంలోని అయ్యప్పగుడికి ఆమె నిత్యం వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రంగమ్మ గుడికి వెళ్లి పూజలు చేసి వెలుపలకు వచ్చింది.ఇంతలో ముగ్గురు వ్యక్తులు పోలీసులము అంటూ చెప్పి సమీపంలో గొడవలు జరుగుతున్నాయని, మీ వద్ద వున్న బంగారం జాగ్రత్తగా బ్యాగ్‌లో పెట్టుకోవాలంటూ సూచించారు. ఆమెను నమ్మించడం కోసం వారిలోనే ఒక వ్యక్తిని ఇదేవిధంగా హెచ్చరించడంతో అతడు భయపడినట్లు నటించి తన మెడలోని బంగారు చైన్‌ను తీసి వారి ముఠా సభ్యులకే అందజేశాడు.
దీంతో అది నిజమేనని నమ్మిన రంగమ్మ తన మెడలోని సుమారు 5 సవర్ల బంగారు తాళిబొట్టును తీసి బ్యాగులో ఉంచేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ దొంగలు అలా కాదు, తాము పెడతామంటూ చెప్పి ఆమె వద్ద నుంచి బంగారాన్ని తీసుకుని బ్యాగులో పెట్టినట్లు నటించారు. అనంతరం రంగమ్మ పక్కకు వెళ్లిన తర్వాత అనుమానం వచ్చి బ్యాగును తనిఖీ చేసుకోగా బంగారం కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ బాధితురాలు సమీపంలోని 5వ నగర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో గతంలో ఇటువంటి సంఘటనలు నిత్యం చోటుచేసుకున్నా ప్రజలు మేల్కొనకపోవడం ఒకటైతే, పోలీసులు నిఘా వైఫల్యం, ప్రజలకు భద్రత కల్పించడంలో వారి ధోరణి మారినట్లుగా కనిపించడం లేదు.
No comments:
Post a Comment