నెల్లూరు : జిల్లాలోని కోవూరు నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా వాహనాలు తనిఖీలు చేస్తున్న అధికారులు తూతూ మంత్రంగా కేవలం కోవూరు వైపు, ఇందుకూరుపేట వైపు వెళ్లే కార్లను మాత్రమే తనిఖీలు నిర్వహించి మిగతా వాహనాలను వదిలివేస్తున్నారు. దీంతో కోవూరు ఉప ఎన్నిక జరిగే ప్రాంతాలకు బస్సులు, స్కూటర్లు, ఆటోలు తదితర వాహనాల ద్వారా యథేచ్చగా మద్యం, నగదు తరలిపోతున్నట్లు సమాచారం. అధికారులు కేవలం కార్లను మాత్రమే తనిఖీ చేస్తుండడంతో ఈ తరహా వాహనాలపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు జరుగుతున్న అన్నీ గ్రామాలకు ఇదే పద్ధతిలో యథేచ్చగా ఇప్పటికే 75శాతం చేరాల్సిన ప్రాంతాలకు చేరిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కేవలం కార్లనే తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు సైరన్ వేసుకుని వెలుతున్న వాహనాలను, పోలీసు అధికారుల ఖాళీగా వెలుతున్నా తనిఖీ నిర్వహించక పోవడంపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి.
అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ తరహా వాహనాల్లో యథేచ్చగా మద్యంను, నగదును తరలిస్తున్నట్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరుగనున్న బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు కాగా ఈ ప్రాంతానికి సంబంధించి పోలీసుల చెక్ పోస్టులు బుచ్చిరెడ్డిపాళెం మండలానికి గాను దువ్వూరు గ్రామం వద్ద ఒకటి, జొన్నవాడ గ్రామం వద్ద ఒక చెక్‌పోస్టు, కోవూరుకు గాను వెంకటేశ్వరపురం వద్ద ఒకటి, రాజుపాళెం వద్ద ఒకటి ఇందుకూరుపేట మండలానికి గాను ఆరవ మైలు వద్ద రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టుల వద్ద జిల్లా పోలీసుల తోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన పోలీసులను కూడా నియమించడంతో తనిఖీలు ఖచ్చితంగా జరుగుతాయన్న అభిప్రాయం తొలుత ఉన్నప్పటికి రాను రాను ఆ అభిప్రాయం కాస్తా మారి పోలీస్ తనిఖీలు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల వాహనాలను తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నట్లు ఆరోపణలు లేక పోలేదు.
ఏది ఏమైనప్పటికి పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కార్లను మాత్రమే టార్గెట్ చేస్తుండడంతో ఇప్పటికే ఇతర వాహనాల ద్వారా ఉప ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాలకి సంబంధించిన అన్ని గ్రామాలకు యథేచ్చగా నగదు, మద్యం ఇప్పటికే చేరిపోయిందన వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మద్యాన్ని మాత్రం జిల్లా నుంచి ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ట్రాక్టర్ల ద్వారా, మ్యాజిక్ ఆటోల ద్వారా చేరినట్లు సమాచారం. ట్రాక్టర్‌కు సంబంధించిన తొట్టిల్లో సగం వరకు మద్యం బాటిళ్ళను నింపి ఆపైన ఇసక నింపి తరలించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి ఎన్ని తనిఖీలు నిర్వహించిన ఎంత మంది సిబ్బంది అప్రమత్తంగా ఉన్నా జరుగనున్న ఉప ఎన్నికల్లో మద్యం, నగదు రాజ్యమేలుతుందనేది జగమెరిగన సత్యమే
No comments:
Post a Comment