నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై గత సంవత్సరం ఆ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తన ఎమ్మెల్యేలతో ఓటు వేయించారని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత చిరంజీవి సోమవారం మండిపడ్డారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్, చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు, జగన్ కుమ్మక్కై ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. అధికార దాహానికి, అవినీతికి, ప్రజా సంక్షేమానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జగన్ పార్టీ అవినీతి పార్టీ అయితే టిడిపి విశ్వాసం కోల్పోయిన పార్టీ అన్నారు.
జగన్ సొమ్ము దోచుకున్న జగన్ ప్రజా సేవ ఎలా చేస్తారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం అనేది ప్రజల నుండి రావాలి తప్ప బలవంతంగా తీసుకుంటే రాదని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలను తీసుకు వచ్చారన్నారు. టిడిపి పాలనలో రైతులకు బాబు చేసిందేమీ లేదన్నారు. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అన్నారు. కుట్రతో ఉప ఎన్నికలు తీసుకు వచ్చిన టిడిపి, జగన్ పార్టీకి కాకుండా కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.అంతకుముందు చిరంజీవి గుడిలో పూజలు చేశారు. కాగా చిరంజీవిని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు.
No comments:
Post a Comment