కోవూరు ఉప ఎన్నిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ ఒక్క స్థానం.. వ్యక్తిగతంగా జగన్‌కే కాకుండా, ఆయన పార్టీ భవిష్యత్తును నిర్దేశించనుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో ఐదింట తెలంగాణ వాదం పేరిట అభ్యర్థులను పోటీకి దించని జగన్ పార్టీ, శాసనసభ్యుడి మృతితో ఖాళీ అయిన మహబూబ్‌నగర్‌లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలంగాణలో రాబోయే రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. ఇదంతా జగన్ పార్టీ వేసిన ఎత్తుగడగా ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు టీడీపీకి రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థిగా కోవూరు నుంచి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించుకోవటం ఇప్పుడు జగన్‌కు అనివార్యంగా మారింది. పైగా ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో తాము పోటీ చేస్తున్న ఒకే ఒక్క స్థానం కోవూరే కావటంతో దానిని కూడా గెల్చుకోలేకపోతే.. పరువు పోతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. దీంతో జగన్ పార్టీ శ్రేణులన్నీ అక్కడే మోహరించాయి.
జగన్ స్వయంగా కోవూరులో వారానికిపైగా ప్రచారం చేశారు. కోవూరు ఉప ఎన్నికను జగన్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించటానికి, కడప ఉప ఎన్నికల తర్వాత చట్ట సభలకు సంబంధించి ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇదే కావటం కూడా ఒక కారణం. జగన్ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కోవూరులో ప్రసన్న గెలుపుతో పాటు, ఆయన సాధించే మెజారిటీ కూడా ముఖ్యమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కోవూరులో ప్రసన్న ఓడిపోతే ఒక రకంగా జగన్‌తో పాటు, ఆయన పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ప్రసన్న గెలిచి, మెజారిటీ తక్కువగా వచ్చినా జగన్ పార్టీకి ఇబ్బందికరమేనని చెబుతున్నారు. అప్పుడు జగన్‌కు కడపలో తప్ప మిగిలిన చోట్ల పట్టులేదనే ప్రచారం సహజంగానే తెరపైకి వస్తుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జగన్‌కు వ్యతిరేకంగా మరింత క్రియాశీలకమవుతాయి. ఇది త్వరలో 17 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవూరు ఉప ఎన్నిక జగన్‌కి, ఆయన పార్టీకి 'చావో రేవో' అన్నట్లుగా మారింది
No comments:
Post a Comment