నెల్లూరు : కోవూరు వైఎస్‌ఆర్‌సి పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజకీయ వ్యసనపరుడని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక ఎసి సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసన్న పాప పరిహారం కోసం డబ్బులు పంపిణీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఓటర్లను మళ్లీ అమ్మేస్తాడని విమర్శించారు. ఒక్క క్షణం ఆలోచించాలన్నారు. విద్రోహులకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల సమరం కాదని, పరువు నిలబెట్టుకునే పోరాట యుద్ధమన్నారు. గతంలో మీ ఓటు ఎటుపోయిందో తెలుసా అన్నారు. డబ్బుకు అమ్ముడుపోయే నేతల గురించి ఆలోచించాలన్నారు. కోవూరు ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ సిపి, టిడిపిలు రెండవ స్థానం కోసం పోటీ పుతున్నాయన్నారు. ఈ ఎన్నికలో తమపై ప్రత్యర్థిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు.
కోవూరు ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి అయిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డినే గెలిపించాలన్నారు. 85 సంవత్సరాలు రాజకీయాల్లో వున్న ఒక కుటుంబ సభ్యుడుగా చెబుతున్నానని, నీతి, నిజాయతీ లేనివారిని ఎన్నుకోవద్దని, వారిని ఎన్నుకుని కోవూరుకు చెడ్డపేరు తేవద్దన్నారు. విశ్వసనీయత, నిజాయతీ గురించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడడమా? అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. 10 రోజుల నుంచి జగన్ నెల్లూరులో తిష్ట వేసి కోవూరు ఉప ఎన్నికపై ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్... ఈ రాజకీయాలు చూస్తేనే బాధ వేస్తున్నదని, విశ్వసనీయత అనే మాట వింటేనే బాధ వేస్తుందని అనడం పట్ల వివేకా పైవిధంగా స్పందించి మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తిళ్ల నుండి పుట్టిన నీవు అనుభవిస్తున్న రాజసౌధ కాంగ్రెస్ పార్టీలో సంపాదించినవే అన్నారు.
అలాంటి నీవు నిజాయతీ, విశ్వసనీయత గురించి మాట్లాడడమా? అన్నారు. వైఎస్‌ఆర్‌ను అభిమానించినవారిని దగ్గరకు రానీయని వ్యక్తి జగన్ అన్నారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడుగా వున్న సూరీడు లాంటి వ్యక్తిని కూడా దగ్గరకు చేరనీయలేదన్నారు. జగన్ నమ్మక ద్రోహి అని వివేకా అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ను విమర్శించిన వ్యక్తి అయిన ప్రసన్నకు పార్టీ టిక్కెట్టు ఇచ్చారని వివేకా ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బర్నాబాస్ ఉన్నారు.
No comments:
Post a Comment