Tuesday, December 22, 2009
నగరంలో తీవ్రమవుతున్న చికున్‌గున్యా జ్వరాలు
నెల్లూరు, మేజర్‌న్యూస్:ఓ వైపు నగరపాలక సంస్థ, మరో వైపు వైద్య ఆరోగ్య శాఖలు దోమల నివారణకు తీవ్రంగా చర్యలు చేపడుతున్నా, మీ చర్యలు తమనేమీ చేయలేవంటూ నగరంలో దోమలు నిరాటంకంగా తమ పని తాము చేసుకుంటున్నాయి. ఫలితంగా చికున్‌గున్యా, డెంగ్యూ తదితర విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చికున్‌గున్యా బాధితులైతే తమ ఇళ్లలోనే ఉండి నానా అవస్థలు పడుతుండగా డెంగ్యూ బాధితులు చెనై్న నగరాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చెనై్న నగరంలోని జనరల్ హాస్పిటల్, విజయ, అపోలో, కంచికామకోటి ట్రస్ట్ తదితర వైద్యశాలలు నెల్లూరు జిల్లాకు చెందిన వందలాదిమంది రోగులతో కిటకిటలాడుతున్నట్లు సమాచారం.అంతేకాకుండా నగరంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల, నారాయణ, బొల్లినేని, జయభారత్, నెల్లూరు వైద్యశాల, జిల్లా ప్రభుత్వ వైద్యశాలలతోపాటు అనేక నర్సింగ్ హోమ్‌లు విషజ్వరాలతో బాధపడుతుండేవారితో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక జూబ్లీ వైద్యశాల (మెటర్నిటీ) మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీతాలక్ష్మి గత నాలుగైదు రోజులుగా చికున్‌గున్యా వ్యాధితో బాధ పడుతున్నారు. జూబ్లీ వైద్యశాల సమీపంలోనే ఎసి.కూరగాయల మార్కెట్ ఉండడంతో ఆ ప్రాంతంలో కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వ్యర్థ పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ ఉండ డం, ఇటీవల వర్షాలు కురవడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధమై వాసనతో భయంకరంగా తయారైంది. సమీపంలోనే బాలికల హాస్టల్ ఉండడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించిన జూబ్లీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సీతాలక్ష్మి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషయాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన ఆ హాస్టల్‌ను సందర్శించి దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సైతం ఆదేశించారు.నగరంలో దోమల పెరుగుదల కారణంగా చిన్న, పెద్ద, స్ర్తీ, పురుష వంటి తేడాలు లేకుండా నగరవాసులు విషజ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగానపడ్డ ప్రజలను తమ వైద్యసేవలతో బాగుచేసే వైద్యులు సైతం ఈ వ్యాధుల బారిన పడుతుండడం విశేషం. పైగా విషజ్వరాల వల్ల రోగులకు ప్లేట్‌లెట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుండడంతో అందుకు అవసరమైన రక్తాన్ని ఇస్తుండే దాతలు సైతం చికున్‌గున్యా బారినపడి మంచాన పడుతుండడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషజ్వరాలను తీవ్రంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment