Tuesday, December 22, 2009
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించం
వెంకటగిరి,మేజర్‌న్యూస్:సోనియా గాంధీ రాష్ట్రాన్ని బర్తడే కేకులాగా ముక్కలు చేసే ప్రతిపాదనను మానుకోవాలని పుత్తూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడించారు. సోమవారం స్థానిక పట్టణంలో ఎమ్మెల్యే కురుగొండ్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహారదీక్ష వద్ద ఆయన పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ లాంటి కుహనా రాజకీయవాదికి భయపడి తెలంగాణాను ప్రకటించాలనుకోవడం అర్ధరహితమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేస్తే సోనియాగాంధీ తనంతట తానే దిగివచ్చి సమైక్యాంధ్రకే మద్దతు పలుకుతుందన్నారు. తెలంగాణాను వేరుపరిస్తే అక్కడవున్న నీటి వనరుల నుంచి ఒక బొట్టు కూడా నీరు కోస్తా, రాయలసీమలకు అందవని అన్నారు. దీంతో ఈ ప్రాంతమంతా ఎడార్లుగా మారుతాయని చెప్పారు. టిడిపి బస్సు యాత్ర ఈనాడు సమైక్యాంధ్ర కోసం రాష్ట్రం యావత్తు జరుపుతుందన్నారు. ఆనాడు ఎన్టీరామారావు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం నిలబెడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 9ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను ప్రపంచస్ధాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశారన్నారు. అలాంటి హైదరాబాద్‌ను దోచుకునే ప్రయత్నంలో కెసిఆర్ కుట్ర పన్నుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని వేరుచేసే విషయం ఆశామాషి కాదని, అలా చిన్నచిన్న ముక్కలైతే అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. కురుగొండ్ల చేపడుతున్న దీక్ష ఆయన ధైర్యానికి నిదర్శనం: మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి సమైక్యాంధ్ర నినాదంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గత మూడు రోజుల నుండి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఆయన ధైర్యానికి నిదర్శనమని శ్రీకాళహస్ర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శిబిరం వద్ద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిన్న ప్రకటనతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ దీక్షకు భయపడి కేంద్రహోం మంత్రి చిదంబరం ప్రకటన చేయడం దారుణమైన విషయమని ఆయన అన్నారు. కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర విషయంలో ఢిల్లీ పెద్దలను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ప్రముఖ మహిళా న్యాయవాది ఎంవిఎస్ గిరిజాకుమారి మాట్లాడుతూ రాష్ట్రంముక్కలు చేయాలనుకోవడం సరైన చర్య కాదన్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసారత్నం మాట్లాడుతూ ఇది ఒక తెలంగాణాకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, యావత్తు రాష్ట్రానికి సంబంధించిన విషయమని, రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించి సమైక్యాంధ్ర నినాదానికే కేంద్రప్రభుత్వం మద్దతు పలకాలని కోరారు. కురుగొండ్లకు సంఘీభావం ప్రకటించిన పలువురు నాయకులు:స్ధానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మూడురోజులుగా చేపడుతున్న ఆమరణ నిరాహారదీక్షలకు పలువురు జిల్లా, మండలస్థాయి నాయకులు సోమవారం తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ విద్యాసంస్ధల అధినేత వంకి పెంచలయ్య, జిఎన్‌ఆర్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు, గూడూరు- వెంకటగిరి నాయకులు, స్ధానిక పాన్‌బ్రోకర్స్ అసోసియేషన్, నాయిబ్రహ్మణ అసోసియేషన్ ర్యాలీగా మంగళవాయిద్యాలతో వచ్చి వారు ఆయనకు తమ సంఘీభావాన్ని ప్రకటించి సమైక్యాంధ్ర నినాదం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment