Friday, December 25, 2009
హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరగాలి
నెల్లూరు, మేజర్‌న్యూస్: వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరిగితే వస్తువుల కొనుగోలు విషయంలో సమస్యలుండవని జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జడ్పీ సమావేశమందిరంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ వస్తువుల ధర తక్కువగా ఉన్నదని కాకుండా, నాణ్యతను చూసి కొనుగోలు చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ఇటువంటి ఆలోచనలు రావాలన్నారు. వస్తువుల కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ ధరలను, ఎక్స్‌పైరీ తేదీలను గుర్తించడం లేదన్నారు. వినియోగదారులు సరైన అవగాహక కలిగి, చైతన్యంతో వ్యాపారస్తులను నిలదీయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వినియోగదారునికి కొన్ని హక్కులుంటాయనీ, వీటి గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఇందు కోసమే జిల్లాలో 99 ఉన్నత పాఠశాలలోనూ, 5 కళాశాలలోనూ వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 25 వినియోగదారుల సంఘాలు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నట్లు వివరించారు. జడ్పీ సిఇఓ రామిరెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడి పాతికేళ్లవుతున్నప్పటికీ, ఇంకా పలుచోట్ల వినియోగదారులు మోసపోతూనే ఉన్నారన్నారు. డిఎస్‌ఓ జ్వాలాప్రకాష్ మాట్లాడుతూ ప్రతి వినియోగదారులు తన ఆర్థిక జ్ఙానాన్ని పెంపొందించుకుంటూ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందేలా సరియైన విలువగల వస్తువులను పొందామా లేదా అని చూసుకోవాలని సూచించారు. వినియోగదారుల ఫెడరేషన్ అధ్యక్షుడు జయరామరాజు మాట్లాడుతూ వినియోగదారుల చట్టంలో ఆరు హక్కులు పొందుపరచబడ్డాయనీ, వీటి సంరక్షణకు కోర్టులకురావడం కూడా జరిగిందన్నారు. అంతక్రితం ఇటీవల మరణించిన వినియోగదారుల సంఘ జిల్లా నేత జితేంద్రనాథ్‌బాబుకు కార్యక్రమంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర వినియోగదారుల సంఘ కార్యదర్శి కెవి సుబ్బారెడ్డి, జిల్లా ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి ఎస్‌వి కృష్ణయ్య, డిఇఓ ఆంజనేయులు, డికెడబ్ల్యు కళాశాల అధ్యాపకురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment