Monday, December 21, 2009
బాల్యం బందీ - సంక్షేమం ఖైదీ
ఇందుకూరుపేట, మేజర్‌న్యూస్:అంచనాలకు అందని రీతిలో పశువులశాలను తలపించే ఓ రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ ప్రభుత్వ వసతి గృహంలో భావిభారత పౌరులు బాధామయ జీవితాన్ని గడుపుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన వసతి గృహాలు వారి పాలిట బందిఖానాలుగా మారాయనేందుకు ఆ హాస్టల్ దర్పణం పడుతోంది.గాలి, వెలుతురు సరిగా సోకని రేకుల షెడ్లు, శిథిలావస్థకు చేరి నేడో రేపో కూలే స్థితిలోవున్న ఇరుకైన పురాతన అద్దె భవనాలు అపురూపమైన బాల్యం ఇక్కడ బందీగా మారిపోయింది. అన్నెం పున్నెం, ప్రపంచ ఙ్ఞానం తెలియని ఆ చిన్నారులు ఏంపాపం చేశారని వారికీ శిక్ష విధించారు. ఎంత తరచి చూసినా ఓ పట్టాన బోధపడటంలేదు. బాల నేరస్తులకందించే సౌకర్యాలు సైతం ఈ బాలురకు కల్పించడంలేదంటే అతిశయోక్తి కాదు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల జైలును తలపించే ఆ వసతి గృహం అడ్రసు కోల్పోతోంది. జిల్లా సాంఘిక సంక్షేమశాఖకే తలవంపులు తెస్తూ జైలును తలపించే ఈ హాస్టల్ మండల కేంద్రమైన ఇందుకూరుపేట ఎంకెఆర్ హైస్కూల్ వెనుకభాగంలో దర్శనమిస్తోంది. ఆ భవనంలోని చీకటి గదుల్లో సంక్షేమం ఖైదీగా మారింది. బాలుర హాస్టల్ కోసం అర్థశతాబ్దం కిందట నిర్మించిన ఈ రేకుల షెడ్డులో వసతుల ప్రసక్తి ఎత్తడం పొరపాటే అవుతుంది. నెలకు సుమారు మూడువేల రూపాయల వంతున ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్న ఈ భవనంలో మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేనేలేవు.విద్యార్థుల కాలకృత్యాలన్నీ ఆరుబయటే. ఒకేఒక పెద్ద హాలు, వరండాలోనే వంద మంది వరకు విద్యార్థులు సర్దుకోవాల్సిందే. భవనంలోని మూడు గదుల్లో ఒకదానిని వంట కోసం, మరోదానిని స్టోర్‌రూంగా, ఇంకోగదిని ఆఫీస్‌గా ఉపయోగిస్తున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ హాస్టల్ భవనానికి చుట్టూ ప్రహరీ కూడా లేదు. తలుపులు, కిటికీలు అంతంత మాత్రమే. వర్షం వస్తే భవనంలో కురవని ప్రదేశమే లేదు. వసతిగృహం పరిసరాలను మహిళలు బహిర్భూమిగా ఉపయోగిస్తుంటారు. హాస్టల్‌కు ఒకవైపు దట్టంగా పెరిగిన కంపచెట్లు, మరోవైపు పొలాలు ఉండడంతో విషసర్పాల బెడద ఎక్కువగా ఉంది. ఏళ్లతరబడి చిన్నారులు బందిఖానాలోనే మగ్గుతున్నప్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం కలగడంలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment