Friday, December 25, 2009
క్రిస్మస్ కళకళలు
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్: క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ ప్రాంతాలు క్రిస్మస్ కాంతులతో కళకళలాడుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మించిన నాటి పరిస్థితులను ప్రతిబింబించే అలంకారాలతో, ఆధునిక విద్యుత్ దీపాల వెలుగులతో క్రిస్మస్ పండుగకు నగరంలో సంసిద్ధమైంది. అలంకరణకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగలో స్టార్స్, శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీలు, అలంకరణకు అవసరమైన బెలూన్స్, రంగు కాగితాలు, రంగురంగుల సీరియల్ సెట్స్, ఙ్ఞానులు, పశువుల కాపరుల బొమ్మలను కొనడానికి అధిక సంఖ్యలో ప్రజలు షాపింగ్ చేయడం గురువారం నగరంలో తారసపడింది. ఏసుక్రీస్తు జననానికి సూచనగా అరుదైన నక్షత్రం ఆకాశంలో వెలిగిందని, అందుకు సూచనగా ప్రతి క్రైస్తవుని ఇంటిపై నక్షత్రాన్ని వెలిగించడం ఆచారంగా క్రైస్తవులు భావిస్తారు. క్రీస్తు జననం పశువుల పాకలో జరిగినందుకు నిదర్శనంగా ప్రతి గృహంలో, పెద్ద పెద్ద సెంటర్లలో పశువుల పాకలను ఏర్పాటు చేసి మరియమ్మ, యోసేబు, ఙ్ఞానులు, గొర్రెల కాపరులు తదితర ప్రతిమలతో అలంకరించి విద్యుత్ దీపాల వెలుగులో క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్‌కు ముందు రాత్రి నగరంలోని ప్రతి క్రైస్తవ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యువతీ యువకులు పాటలతో నృత్యాలు చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలను అందరికీ తెలిపే కేరల్స్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. కేరల్స్‌లో శాంతాక్లాజ్ (క్రిస్మస్ తాత) వేషధారణ ప్రత్యేక ఆకర్షణ గా కేరల్స్‌లో ఉత్సాహాన్ని అందించడానికి దోహదం చేస్తుంది. క్రీస్తు జన్మించిన కొన్ని శతాబ్దాల తర్వాత క్రిస్మస్‌తాత వేషధారణతో ఓ వ్యక్తి నిరుపేద ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఉండేవారని, ఆయనను స్మరించుకోవడం కోసం క్రిస్మస్ తాత ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. పశువులపాకతో పాటు క్రిస్మస్ ట్రీ అలంకరణ ఎంతో ప్రాముఖ్యమైంది. పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రీని క్రిస్మస్ బహుమతులతో అలంకరించి బహుమతులను అందజేయడం ఆనవాయితీ. స్థానికంగా ప్రతి ఇంట్లో ఈ ట్రీలకు దూతల, ఙ్ఞానుల, నక్షత్ర, శాంతాక్లాజ్, బెలూన్స్, గ్రీటింగ్ కార్డులతో అలంకరించడంతోపాటు పెద్ద పెద్ద కూడళ్లలో భారీస్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగాయి. అలంకరణలతోపాటు ఆధ్యాత్మికంగా పండుగను జరుపుకోవడంలో భాగంగా నగరంలోని ప్రతి క్రైస్తవ దేవాలయాల్లో గురువారం అర్థరాత్రి నుండి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment