Tuesday, December 22, 2009
సాహిత్య రంగంలో వర్థమాన సమాజం ఆదర్శం
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్:సింహపురిలో సాహిత్య సేవా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన శ్రీ నెల్లూరు వర్థమాన సమాజం నేటికీ ఆదర్శమని విక్రమసింహపురి వైస్ చాన్సలర్ సి.విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని టౌన్‌హాల్‌లో నిర్వహించిన శ్రీ నెల్లూరు వర్థమాన సమాజం శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ బెజవాడ గోపాలరెడ్డి, మరుపూరు కోదండరామిరెడ్డి, దువ్వూరు రామిరెడ్డి తదితర సాహిత్య ఉద్దండులు వర్థమాన సమాజం ద్వారా సింహపురి నగరానికి ఎనలేని కీర్తిని ఆపాదించారని అన్నారు. తెలుగు సాహిత్య రంగంలో వర్థమాన సమాజం ఒక ప్రత్యేక ఒరవడిని రూపొందించుకుని వందేళ్లకు పైగా సేవలందించడం ఆదర్శమని ఆయన అన్నారు.నెల్లూరు జిల్లా సెషన్స్ జడ్జి గణేష్ యాదవ్ మాట్లాడుతూ 45 వేల గ్రంధాలతో ఇన్నేళ్లుగా సాహిత్య సేవలు అందించడం విశేషమని అన్నారు. భావితరాలకు సాహిత్య సేవలను అందించడానికి వర్థమాన సమాజం దినదిన ప్రవర్థమానం చెందాలని ఆకాంక్షించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న మైసూర్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు శ్రీమద్భగవద్గీతను ప్రేక్షకులకు వివరించారు. అనంతరం వర్థమాన సమాజం సభ్యులు ఆయనను సన్మానించారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు అతిధులు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్థమాన సమాజం అధ్యక్షులు మలుచూరు ధర్మారెడ్డి, కార్యదర్శి మజ్జిగ ప్రభాకర్‌రెడ్డి, పురమందిర ప్రతినిధి పొన్నాల రామసుబ్బారెడ్డి, బివి.నరసింహం ఎం.బలరామనాయుడు, సుభద్రాదేవి, సాహిత్య ప్రియులు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment