Tuesday, December 22, 2009
మతాలు ఉద్యానవనంలో పుష్పాలు
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్:ప్రపంచమనే ఉద్యానవనంలో మతాలు పుష్పాలని కరుణామయి విజయేశ్వరీదేవి అభివర్ణించారు. ఆదివారం నగరంలోని విఆర్.కళాశాల మైదానంలో నిర్వహించిన విజయోత్సవ అభినందన సభలో ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ మతాలన్నీ శాంతిని కాంక్షిస్తాయని అన్నారు. పుష్పాలు వేరైనప్పటికీ సౌరభం వాటి లక్షణమని, అలాగే మతాలు మానవాళి శ్రేయస్సు కోసమేనని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోన్ నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న కరుణామయి విజయేశ్వరిదేవి తన అనుభవాలు గూర్చి భక్తులకు వెల్లడించారు.ప్రపంచ దేశాల్లో ప్రస్తుతమున్న సమస్యలను, అలజడులను మతం ద్వారా వాటిని పరిష్కరించడానికి ఉపయోగపడే అనేక అంశాలను ఆమె వివరించారు. గ్రామస్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు శాంతియుత సహజీవనం చేయడానికి ఐకమత్యం అవసరమని ఆమె ఉద్బోధించారు. చదువు ద్వారా దేశంలో అభివృద్ధిని సాధించవచ్చునన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకున్న గొప్ప పేరును ప్రపంచ వ్యాప్తంగా పలు మత గురువుల అభిప్రాయలను ఆమె విశదీకరించారు. సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చడానికి, నివాసం కల్పించడానికి ఆధ్యాత్మిక చింతన పెంపొందించి మానవాళిలో అశాంతిని తొలగించడానికి తాను అన్ని విధాలా కృషి చేస్తున్నానని తెలిపారు. భగవంతుడు తనకిచ్చిన స్థానం ద్వారా సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఆసుపత్రులను, పాఠశాలలను, వృద్ధాశ్రమాలను, యోగా కేంద్రాలను, వేద పాఠశాలలను నిర్వహిస్తున్నామన్నారు. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఏకైక ఆధ్యాత్మి కేంద్రం శ్రీమాతృదేవి విశ్వశాంతి ఆశ్రమమని అన్నారు. తాను పర్యటించిన 20 దేశాల్లో పాశ్యాత్యులను సైతం ప్రభావితం చేసిన భారతజాతి ఔన్నత్యాన్ని ప్రజలు పరిరక్షించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముర ళీకృష్ణ 70 అధినేత వీరిశెట్టి హజరత్‌బాబు, కళాబంధు కొండా బలరామిరెడ్డి, సేవారత్న ఒమ్మిన సుబ్రహ్మణ్యం, తెలుగు సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఎన్.బలరామయ్యనాయుడు, విద్యాదాత ఆనందరావు, కాంగ్రెస్ నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కావలి కోటారెడ్డి, కవి ఆలూరు శిరోమణి శర్మ, తల్పగిరి ఆలయ ఛైర్మన్ పత్తి రవీంద్రబాబు తదితర పుర ప్రముఖులు వేద మంత్రోచ్ఛారణల నడుమ విజయేశ్వరిదేవిని ఘనంగా సన్మానించారు. సభాసింమం బివి.నరసింహం వ్యాఖ్యానం అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన కరుణామయి భక్తులతోపాటు భారీ సంఖ్యలో స్థానిక భక్తులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment