నెల్లూరు : నెల్లూరు నగరంలో ముస్లింలు, ముస్లిమేతరులు మతసామరస్యానికి ప్రతీకగా ఆచరించే రొట్టెల పండుగ ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక బారాషాహిద్ దర్గా వద్ద ఆదివారం ఉదయం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం మెరుగైన సదుపాయాలతో, అంకిత భావంతో భక్తులకు సేవలు కల్పించి రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన అన్నారు. దర్గా ఆవరణంలో లే అవుట్ ప్రకారం 293 అంగళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేలంద్వారా పొందిన షాపులను నిర్ణీత స్థలాల్లోనే ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించకూడదని ఆయన పేర్కొన్నారు. 24 గంటలూ భక్తులకు తాగునీటి వసతి సదుపాయం, ఉచిత వైద్యసేవలు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య చర్యలు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సౌకర్యాలు తదితర అంశాల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులతో సమాలోచనలు చేశారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరానికి ప్రత్యేకతను సంతరింపచేసిన రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుండి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని వివిధ శాఖల అధికారులను కోరారు.
డిఎస్‌పి రాధిక మాట్లాడుతూ రొట్టెల పండుగ జరిగే రోజుల్లో అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా భారీ పోలీసు బలగంతో రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేరాలను అదుపు చేయుట తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నామన్నారు. వాహనాల పార్కింగ్‌కు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్‌ఐలు, 40 మంది సబ్‌ఇన్స్‌పెక్టర్లు, 180 మంది ఎఎస్‌ఐలు, 500 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 40 మంది ఆర్మ్‌డ్ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. మేయర్ భానుశ్రీ మాట్లాడుతూ లక్షలాదిమంది భక్తులు పాల్గొనే ఈ రొట్టెల పండుగకు ఒక రోజు ముందునుండే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలను 24 గంటలూ చేపడతామన్నారు. సిబ్బంది మూడు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహిస్తూ ప్రతి షిఫ్ట్‌లోనూ 150 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేసే విధంగా ప్రణాళికను రూపొందించామన్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులు
ఈ ఏడాది రొట్టెల పండుగ వేడుకలకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అసుదుద్దీన్ ఓవైసి, వక్ఫ్ బోర్డు రాష్ట్ర నాయకులు, బారాషాహిద్ దర్గాకు సంబంధించిన పలువురు ప్రముఖులు పాల్గొంటారు. నెల్లూరు డివిజనల్ రెవెన్యూ అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టిఎస్‌ఆర్.ఆంజనేయులు, ఎంఆర్‌ఒ భక్తవత్సలం, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, పలువురు మున్సిపల్ కార్పొరేటర్లు, వక్ఫ్‌బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment