నెల్లూరు,: రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో కొనసాగుతున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలు రోజురోజుకీ ఊపందుకుంటున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యార్థి సంఘాలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను మూయించారు. ఇప్పటివర కూ చట్టసభల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల, మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామాలకే పరిమితమైన నెల్లూరుజిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీల రాజీనామాలకు తెలుగుదేశం పార్టీ సోమవారం శ్రీకారం చుట్టింది.
ఆ పార్టీకి చెందిన 5గురు జడ్పీటీసీ సభ్యులు,ఆరుగురు ఎంపీపీలు సోమవారం తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాయుడుపేటలో సమైక్యవాదులు పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి రైల్‌రోకో నిర్వహించారు. ఐదవ నెంబరు జాతీయ రహదారిని కోవూరు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట తదితర జాతీయ రహదారి వెంబడి ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు, సమైక్య వాదులు దిగ్బంధనం చేయడంతో వాహనాలు బారులు తీరాయి. నగరంలోని విఆర్‌సీ, ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద విద్యార్థి సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో నగర మేయర్ ఎన్.భానుశ్రీ పాల్గొని తమ మద్దతు పలికారు. గాంధీబొమ్మ సెంటర్‌లో రాజీవ్‌భవన్ ఆధ్వర్యంలో జరిగిన వినూత్న నిరసన కార్యక్రమంలో భాగంగా జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమైక్య ఘంటానాదాన్ని మోగించారు.
ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో సమైక్యాంధ్రను కోరుతూ భారీ స్కూటర్ ర్యాలీ జరిగింది. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్‌పీ కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాలలలో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించేంత వరకూ తమ ఉద్యమం ఆగబోదని వివిధ సందర్భాలలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పేర్కొనడం గమనార్హం.
No comments:
Post a Comment