నెల్లూరు(క్రైం) : నగరంలో రోజు రోజుకూ ఏ మూల చూసినా ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువైనాయి. వీటిని అరికట్టడానికి అంతే చిక్కడం లేదు. ప్రతి రోజూ నగరంలోని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ద్విచక్ర వాహనాలు పోయినాయని కేసులు నమోదు కావడం పరిపాటైపోయింది. కొంతమంది వాహనాలు పోగొట్టుకున్నవారు నిరాశతో కేసు పెట్టకుండా మానుకుంటున్నారు. ఒకవేళ వాహనం పోయిన వ్యక్తి కేసు పెట్టడానికి క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే వచ్చిన వ్యక్తిని ఏదో క్రైం చేసినవాడిలాగా చూస్తున్నారని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.
4వ నగర పరిధిలో గత ఏడాది మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వ్యక్తి దొంగను పట్టించి వాహనం ఎక్కడున్నది కూడా వివరాలు అందజేస్తే దాని విషయంలో అధికారి ఒకరు చొరవ చూపించి ఆమ్యామ్యాలతో కేసును మాఫీ చేసినట్టు సమాచారం. నగర పరిధిలో ఐదు లా అండ్ ఆర్డర్, క్రైం పోలీస్ స్టేషన్‌లతోపాటు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది వందల సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ స్టేషన్ల పరిధుల్లో ఎవరైనా చోరీ చేస్తూ అతని దురదృష్టవశాత్తు పోలీసులకు చిక్కితే ఆ స్టేషన్ అధికారులు అతన్ని ఏమీ అనకుండా నేరుగా సిసిఎస్ స్టేషన్‌కు హ్యాండ్‌ఓవర్ చేసి తమ పనైపోయింది బాబు అంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ స్టేషన్‌లలో సీనియర్ పోలీస్ సిబ్బందేగాక, అత్యధిక విద్యావంతులు, తెలివిగలవారు ఉన్నప్పటికీ వారి పనితీరు బాగుండదనా లేక వారి సేవలు అనవసరం అన్నట్లుగా ఉంటున్నది. కేవలం నగరాన్ని శాసిస్తూ సిసిఎస్‌లో ఏళ్లతరబడి పాతుకుపోయిన ఆ నలుగురూ... చేసే సేవలే తప్ప మిగిలినవారివి తీసుకోవడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గొప్పగొప్ప చదువులు చదివి పోలీసు ఉద్యోగంలో చేరినటువంటి యువతకు తమ ప్రతిభా పాటవాలను చూపించుకునే అవకాశాన్ని సిసిఎస్ ఇవ్వడం లేదు.
కేవలం అప్పుడెప్పుడో చేసిన రికవరీలు ఆధారంగా వారే గొప్ప అన్నట్లు, వారు లేందే మాకు దిక్కెవరు అంటున్న అధికారులు సైతం సిసిఎస్‌లో చూడవచ్చు. సినిమాల్లో ఎవరైనా ఒక పాత్ర వేస్తే ఆ పాత్రే వారికి జీవితాంతం దిక్కన్నట్లు సిసిఎస్‌లో కొలువుదీరివున్న సీనియర్ పోలీస్ సిబ్బంది బదిలీపై నగరంలోనే ఏదో ఒక స్టేషన్‌కు వె ళ్లినా, వారి కొలువులు మాత్రం సిసిఎస్‌లోనే చేయడం ఆనవాయితీ. ఇప్పటికే ఉడుకు రక్తానికి క్రైం ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఇవ్వడంలేదని విమర్శలు ఉన్నాయి. నగరంలో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చోరీలు చేస్తూ ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ తమ చేతి వాటాన్ని ప్రదర్శించుకుంటున్న చోరీగాళ్లను పట్టుకోవడంలో విఫలమవుతున్న క్రైం పోలీసులు పాత పద్ధతులు వదలి నూతన ఒరవడికి అవకాశం ఇస్తే బాగుంటుందని పలువురి అభిప్రాయం.
No comments:
Post a Comment