నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేల మొదలు స్థానిక ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానీకం వరకూ అందరూ తరతమ బేధాలు మరచి చేపట్టిన ఉద్యమం రోజురోజుకీ ఉధృతమై ఉప్పెనలా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాల, విద్యార్థి సంఘాల ఆందోళన, నిరసన కార్యక్రమాలు గురువారం కూడా కొనసాగాయి. నగరంలోని కెవిఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఏడుగురు ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిల తొమ్మిది తలల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వీరంతా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకునే ప్రత్యర్థి పార్టీల నేతలు తమ ప్రత్యర్థి పార్టీ చేపట్టే నిరాహారదీక్షలకు హాజరై తమ సంఘీభావం తెలపడం విశేషం. ఈనెల 21, 22, 23 తేదీలలో సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించనుంది.
గ్రామస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లడమే తమ ధ్యేయమని మాజీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు సైతం తమ మద్దతు తెలపడం విశేషం. ముఖ్యంగా ఆటో, టాక్సీ డ్రైవర్లు తమ వాహనాల ముందు భాగంలో సమైక్యాంధ్ర కావాలనే బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. కళాకారులు సైతం ఉద్యమంలోకి అడుగుపెట్టారు. నగరంలో 5గురు కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీవ్ భవన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నగరంలో వినూత్న నిరసనలు చేపడుతున్నట్లు డిపిసి సభ్యుడు వైవి రామిరెడ్డి ప్రకటించారు. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద టీడీపీ కార్యకర్తలు పొర్లుదండాలు పెడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment