నెల్లూరు: సమైక్యాంధ్రే ధ్యేయంగా ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో రిలే నిరాహారదీక్షా శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో దీక్షకు పాల్గొన్న సోమిరెడ్డి మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటుగా వ్యవహరించిన కేంద్రప్రభుత్వం ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రాజకీయ పక్షాల నేతలు పార్టీలకతీతంగా సమైక్యాంధ్రే ఉండాలంటూ తెలంగాణాను విభ జనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయని, ఒక్కో రోజు ఒక్కో అనుబంధ సంఘ నేతలు ఈ దీక్షలో పాల్గొంటారని అన్నారు.
ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ద్విగుణీకృతం చేసిన దివంగత నందమూరి తారక రామారావు ఎప్పుడూ ఆంధ్రులంతా సమైక్యంగా ఉండాలనే కోరుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులపైనా ఉందన్నారు. ఈ శిబిరంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్, తాళ్లపాక అనూరాధ, వై.వి.సుబ్బారావు, మండవ రామయ్య, అంచెల వాణి, కె.వి.శేషయ్య, బొమ్మి సురేంద్ర, కోడూరు కమలాకర్‌రెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment