భక్తవత్సలనగర్ (నెల్లూరు):సమాజం కోసం జర్నలిస్టులు కలం పట్టి పనిచేయడమే కాకుండా స్వయంగా ఆరోగ్య పరిరక్షణకు, కుటుంబ సభ్యుల పోషణ పట్ల కూడా శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ జర్నలిస్టులకు సూచించారు. బుధవారం ఉదయం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఇటీవల దివంగతులైన ఆంధ్రజ్యోతి విలేకరి హనీఫ్, చైతన్యజ్యోతి సాయంకాల దినపత్రిక ఎడిటర్ కె.చెంగళరాజుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జర్నలిస్టులనుద్దేశించి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం కలంపట్టి పనిచేసే జర్నలిస్టులు వారి ఆరోగ్యం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. జర్నలిస్టులు 24 గంటలు శ్రమిస్తూ తరచూ అనేక వత్తిడులకు గురవుతున్నారని, దాని నుండి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఒక గంటసేపు యోగా, కాలి నడక, వ్యాయామాలను చేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు దివంగత విలేకరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం ఎపియుడబ్ల్యుజె ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అధ్యక్షులు ఎ.జయప్రకాష్, భాస్కర్‌రెడ్డిల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, శ్రీరామచంద్రమూర్తి, చలపతి, కృష్ణాపత్రిక రిపోర్టర్ సుధాకర్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయులు, సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment