నెల్లూరు, మేజర్‌న్యూస్ ప్రతినిధి : బంగారం ధరల పెరుగుదల రికార్డుస్థాయిని అధిగమించింది. ఈనెలలో దాదాపుగా ప్రతిరోజూ పెరుగుదలను సూచిస్తూ గ్రాముపై సుమారు 180 రూపాయలకు చేరుకుంది. డిసెంబర్ మొదటి వారంలో గ్రాము బంగారం 1800 రూపాయలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పసిడి వర్తకులు పేర్కొంటున్నారు. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో సామాన్యులు జ్యువెలరీ షాపులకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. అయితే బంగారాన్ని పెట్టుబడిగా భావించే ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు మాత్రం బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
బంగారం ధరలు గత సంవత్సరకాలంగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది ఈ సంవత్సరంలో మరింత అధికంగా ప్రభావాన్ని చూపుతోంది. జూన్‌లో గ్రాము 1350 రూపాయలు ఉండగా, జూలై మాసంలో 1390కి చేరింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 1440 వరకూ చేరింది. ఇక నవంబర్ నెల ప్రారంభం నుంచి బంగారం ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ పెరుగుదల ప్రతిరోజూ కనిపించడం విశేషం. బంగారం వ్యాపారులు సైతం ధరల పెరుగుదల చూసి విస్తుపోతున్నారు.
ఈనెల 2 వతేదీన గ్రాము బంగారం ధర 1500 రూపాయలు, 9వ తేదీన 1563, 14వ తేదీన 1570, 18వ తేదీన 1600కు పెరిగి బుధవారం నాడు ఏకంగా 1657 రూపాయలు పలికింది. ఇదేవిధంగా వెండి ధర కూడా బంగారానికి అనుగుణంగా పెరుగుతూ వచ్చింది. జూన్, జులై నెలల్లో కిలో వెండి 23 వేల రూపాయల నుంచి 24 వేల రూపాయల వరకూ పెరుగుతూ రాగా నవంబర్ నెల మొదటి వారంలో 27,200కు చేరింది. క్రమంగా 9వ తేదీన 28,500, 18వ తేదీన 29,100 వరకూ పెరిగి బుధవారం నాడు 29,800కు చేరింది.
డాలర్ విలువ పతనం కావడం, ఆర్థిక మాంధ్య ప్రభావం తదితర కారణాల వల్ల సుమారు సంవత్సర కాలంగా బంగారం ధరలు పెరుగుదలను సూచిస్తున్నాయి. పెట్టుబడులకు వ్యాపారాలు, భూముల కొనుగోళ్లు అనుకూలంగా లేకపోవడంతో బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. దీనికి తోడు ఇటీవలే రిజర్వ్‌బ్యాంక్ ఇండియా భారీగా బంగారాన్ని కొనుగోలు చేసింది. త్వరలో మరోవిడత కొనుగోళ్లకు రంగం సిద్ధం చేస్తోంది. మరోపక్క రియల్‌ఏస్టేట్ ఆశాజనకంగా లేకపోవడం, షేర్‌మార్కెట్‌లో అనూహ్యమైన హెచ్చుతగ్గులు ఉండటంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు సరైన నిర్ణయంగా భావిస్తున్నారు.
మరోపక్క ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో బంగారాన్ని అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉండటంతో ఆ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ ఆర్థిక సంస్థలు కూడా బంగారం తాకట్టుపై నిబంధనలను పూర్తిగా సడలించారు. పైగా కొన్ని సంస్థలు గ్రాముపై 1550 రూపాయలు ఇవ్వడం, బంగారం ఇచ్చిన వెంటనే నగదు లభించడం ప్లస్‌పాయింట్‌గా మారింది. ఇళ్లస్థలాలు, ఇతర ఆస్తులు తాకట్టు పెట్టాలన్నా, అమ్మాలన్నా అంతత్వరగా వీలుపడని కారణంగా బంగారాన్నే సరైన పెట్టుబడిగా ప్రస్తుతం ధనిక, మధ్య తరగతి కుటుంబాల వారు భావిస్తున్నారు.
No comments:
Post a Comment