Tuesday, November 24, 2009
లాభాల కోసం ఆర్టీసిలో ప్రత్యేక చర్యలు
సంతపేట (నెల్లూరు) :ఆర్టీసిని లాభాలబాటలో పయనింపచేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆర్టీసి డిపో మేనేజర్లను రీజనల్ మేనేజర్ పి.శేషగిరిరావు ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆర్టీసి రీజనల్ మేనేజర్ కార్యాలయంలో డిఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్‌ల వల్ల పలు మార్గాల్లో బస్సులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో లక్ష 41 వేల కిలోమీటర్ల మైలేజీ రద్దయిందన్నారు. వర్షాల వల్ల రీజియన్ పరిధిలో రూ.61లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. భవిష్యత్తులో లాభాలను ఆర్జించేందుకోసం తగు చర్యలు చేపట్టాలని డిఎంలను ఆదేశించారు. అదేవిధంగా బ స్టాండ్లు, బస్సుల్లో పరిశుభ్రతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. బస్సులు ప్రయాణించేటప్పుడు 50 అడుగుల దూరం ఖచ్చితంగా ఉండేవిధంగా డ్రైవర్లకు సూచించాలని డిఎంలను కోరారు. ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను సిడిల ద్వారా ప్రతి మంగళవారం ఆయా డిపోల పరిధిలో డ్రైవర్లకు శిక్షణ ఇస్తామన్నారు. 54 సీట్లు ఉండే బస్సుల్లో 20 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుండడం వల్ల ఆర్టీసికి నష్టాలు వస్తున్నాయని, వీటిని అధిగమించేందుకు గ్రామాల్లో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. గత నెలలో ప్రధమ, ద్వితీయస్థానాలు సాధించిన నెల్లూరు-2 డిపో మేనేజర్ పి.శీనయ్య, కావలి డిపో మేనేజర్ మధుబాబులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎంవి.ప్రభాకర్‌రెడ్డి, 1వ డిపో మేనేజర్ ఈగా భాస్కర్‌రెడ్డి, 2వ డిపో మేనేజర్ పి.శీనయ్య, జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment