online marketing

Friday, November 27, 2009

హాస్టల్‌నుంచి ముగ్గురు విద్యార్ధులు అదృశ్యం

నాయుడుపేట: గత శనివారం నాయుడుపేట హాస్టల్‌ నుంచి వారి ఇళ్లకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు సోమవారం చేరి సాయంత్రం అదృశ్యమై నేటికి ఆచూకి తెలియని సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంమై విద్యార్థుల తల్లిదండ్రులు నాయుడుపేట ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌ను ప్రశ్నించారు. అదృశ్యమైన విద్యార్థులతో ఉన్న మురళి అందించిన సమాచారం మేరకు దొరవారిసత్రం మండల కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన మావిళ్లపాటి లింగయ్య, వెంకటమ్మ దంపతుల ఏకైక కుమారుడు యం విజయ్‌కుమార్‌, అదే గ్రామానికి చెందిన తిరునామలై సురేష్‌, అరుణమ్మల రెండవ కుమారుడు టి ప్రవీణ్‌, సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరు గ్రామానికి చెందిన సాలు చిన్నయ్య, చెంగమ్మల సంతానం సాలు బాలాజీలు నాయుడుపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్నారు.

కాగా శనివారం వార్డెన్‌ పర్మిషన్‌తో స్వగ్రామాలకు వెళ్లారు. తిరిగి సోమవారం హాస్టల్‌కు చేరుకుని అదే రోజు సాయంత్రం హాస్టల్‌ ప్రాంతంలో ఉన్న మురళి అనే యువకునితో కలసి నాయుడుపేట నుంచి గూడూరుకు యూనిట్‌ ట్రైన్‌లో వెళ్లారు. అక్కడ సుందరమహాల్‌ అనే థియేటర్‌లో 2012 యుగాంతం సినిమా చూసి ప్యాసింజర్‌లో తిరుపతి చేరుకుని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.

ఇక్కడ వరకు విద్యార్థులకు ఖర్చులు భరించిన మరళి వారికి చెప్పకుండానే నాయుడుపేటకు చేరుకున్నాడు. ఈ విషయమై మురళిని ప్రశ్నించగా పలు రకాలు కథనాలు చెపుతున్నాడు. మురళి పోకిరిగా తిరుగుతూ ఇక్కడే ఓ వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. విద్యార్థుల తల్లి దండ్రులు మురళి వచ్చాడన్న సమాచారం తెలుసుకుని మా పిల్లల ఆచూకి తెలపాలంటూ రోదించారు. నాలుగు రోజులుగా విద్యార్థులు కనిపించకుండా పోవడం తల్లిదండ్రులకు తగు సమాచారం అందించక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటన గురువారం నాయుడుపేటలో సంచలనం కలిగించింది.

విద్యార్థుల అదృశ్యంపై ఫిర్యాదు: విద్యార్థులు అదృశ్యమయ్యారన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెండు రోజులుగా వారి బంధువుల ఇళ్లలో వెతికి గురువారం నాయుడుపపేటకు చేరుకుని హాస్టల్‌ సంక్షేమ అధికారితో కలసి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విద్యార్థులను వెతికిస్తాం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థులను వెతికించేందుకు తాము ప్రయత్నిస్తామని స్థానిక మండల ఎస్సీ సెల్‌ నాయకులు ఎగుదాల విజయ్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థుల అదృశ్యమైన విషయమై ఇక్కడి వార్డెన్‌తో ఆయన చర్చించారు. తల్లిదండ్రులుతో కలసి విద్యార్థులను వెతికించే ప్రయత్నం చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh