Tuesday, November 24, 2009
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం
నెల్లూరు రూరల్:గ్రామదర్శినిలో వచ్చిన ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొత్తూరులో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను గ్రామాల వద్దే పరిష్కరించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. డిశంబర్ 15వ తేదీకి గ్రామదర్శిని కార్యక్రమం ముగుస్తుందని ఈ సందర్భంగా వచ్చిన అర్జీలను సమస్యల వారీగా విభజించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో కొత్తూరు ప్రాంతంలో టిడిపి హయాంలో 103 పింఛన్లు ఉంటే ప్రస్తుతం 925 పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హులందరికీ 1035 ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చామన్నారు.శ్రామికనగర్, కుమ్మరిగుంటల మీదుగా పోతున్న కాలువను కూడా త్వరలో నిర్మిస్తామన్నారు. సమస్యలను నిర్భయంగా తమకు తెలియజేయాలని ఆయన స్థానికులను కోరారు. కొత్తూరులో స్థానిక సమస్యలైన వీధి దీపాలు, రోడ్లు, మంచినీటి సదుపాయాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కొత్తూరు పంచాయతీని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఎంపిటిసి మాధవి, శ్రీనివాసులు, ప్రభాకర్‌రెడ్డి, హరి, పిండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment