Tuesday, November 24, 2009
అందనంత ఎత్తుకు నిత్యావసరాలు
నెల్లూరు: నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేస్తున్నామని ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తుంటే, మరోపక్క సామాన్యులకు అందనంత ఎత్తులో ధరలు పెరుగుతున్నాయి. ఉల్లిపాయలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 30 నుంచి 32 రూపాయలు పలుకుతున్నాయి. రెండో రకం 28 రూపాయలుగా ఉంది. రెండో రకం ఉల్లిపాయల్లో నాసిరకం అధికంగా ఉండటంతో 30 రూపాయలు చెల్లించకతప్పడం లేదు. నిత్యం కూరల్లో తప్పనిసరిగా వాడాల్సిన ఉల్లిపాయలు ఒక్కసారిగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం రెండు రూపాయలుగా ఉన్న కోడిగుడ్డు ధర సోమవారం మార్కెట్‌లో మూడున్నర రూపాయలు పలికింది. ఉల్లిపాయలు, కోడిగుడ్లు కావలిసిన మేరకు దిగుమతి కాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే ధరల అదుపు విషయం అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు విమర్శిస్తున్నారు. వంట నూనెల ధరలు సంవత్సరం క్రితం గణనీయంగా పెరిగినప్పుడు వాటిపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా దిగివచ్చాయి.మరోపక్క చౌకధరల దుకాణాల్లో లభించే పామోలిన్ ఆయిల్ కంటే బహిరంగ మార్కెట్‌లో నాలుగు రూపాయలు తక్కువకు లభించేది. అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి మళ్లీ నూనెల ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా పొద్దుతిరుగుడు ఉత్పిత్తి గణనీయంగా తగ్గిపోవడంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో పాటు వేరుశనగ నూనెల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. వేరుశనగనూనె గత నెల మొదటి వారంలో 65 రూపాయలు ఉండగా ప్రస్తుతం 80 రూపాయలకు లభిస్తోంది. ఇది ఇంకో పది రూపాయలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా పామోలిన్ ఆయిల్ ప్యాకెట్ ధర ప్రస్తుతం రెండు రూపాయలు పెరిగింది. ఈ రకం నూనె ధర భవిష్యత్తులో పెద్దగా హెచ్చుదల ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆదోని రకం సన్‌ఫ్లవర్‌ఆయిల్ ధర 43 రూపాయల నుంచి 50కు పెరిగింది.ఇక మార్కెట్‌లో అధికంగా డిమాండ్ ఉండే బ్రాండెడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు మాత్రం అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. గత పక్షం రోజులుగా ప్రతిరోజు ఎంతో కొంత హెచ్చుదలను సూచిస్తున్నాయి. ప్రస్తుతం 60 నుంచి 70 రూపాయలకు వెళ్లింది. సంక్రాంతి నాటికి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ప్యాకెట్ ధర 90 రూపాయలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాకు కాకినాడ పోర్టు నుంచి వంట నూనెలు రవాణా అవుతున్నాయి. జిల్లాలో రోజుకు పది ట్యాంకర్ల వంట నూనెను వినియోగిస్తున్నారు. దీనితో ధరల పెరుగుదల ప్రభావం జిల్లాపై అధికంగా చూపిస్తోంది. ఒక కందిపప్పు ఒకటో రకం 95 నుంచి వంద రూపాయల వరకూ ఉంది. చింతపండు, మినపప్పు, మిర్చి, బియ్యంతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు ప్రతి నెలలో పెరుగుదలను సూచిస్తుండటంతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment