Tuesday, November 24, 2009
అపార్ట్‌మెంట్‌వాసులూ... తస్మాత్ జాగ్రత్త- నగర డిఎస్‌పి రాధిక
నెల్లూరు :నగరంలోని మాగుంటలేఅవుట్ వద్దనున్న లెక్చరర్స్ కాలనీలో కొద్ది రోజుల క్రితం దొంగలు అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించి భారీఎత్తున దొంగతనాలకు పాల్పడిన సందర్భంగా నగర డిఎస్‌పి జిఆర్.రాధిక మంగళవారం మధ్యాహ్నం ఆ అపార్ట్‌మెంట్ వాసులను కలిసి దొంగతనాలు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇకపై అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు జాగరూకులై ఉండాలని, కొత్తవారు ఎవరైనా వచ్చినపుడు గమనించాల్సిన బాధ్యత అపార్ట్‌మెంట్‌లో నియమించబడిన వాచ్‌మెన్‌తోపాటు ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చేవారిని, పోయేవారిని గమనించడమే కాకుండా అపార్ట్‌మెంట్ వాసులు కూడా ఐడి కార్డులు ఉంచుకోవడం మంచిదన్నారు.పగలు పురుషులు ఉద్యోగరీత్యా బయటకు వెళ్తారు కాబట్టి, ఆడవారు టివీలు చూస్తూ తలుపులు వేసుకోకుండా ఉండడం వలన దొంగతనాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. నగర డిఎస్‌పితోపాటు సిఐ వీరాంజనేయరెడ్డి, 4వ నగర ఎస్‌ఐ వేమారెడ్డి, 5వ నగర ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి తదితరులతో ఇళ్లలోకి పగలే అనుమానితులు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి వ్యూహాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ముందుగానే సివిల్ డ్రెస్‌లో ఉన్న తమ పోలీసులు ప్రభాకర్, ప్రసాద్‌లను పావని ఎన్‌క్లేవ్, పావని పార్క్ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి అపార్ట్‌మెంట్ వాసులు జాగ్రత్తగా ఉన్నారా? అజాగ్రత్తగా ఉన్నారా? గమనించాల్సివుందని ముందుగా పంపించారు. వారు వెళ్లిన కొద్దిసేపటికి డిఎస్‌పి తన సిబ్బందితో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగా ముందు వెళ్లిన కానిస్టేబుళ్లు డి.బ్లాక్‌లోని 102 అపార్ట్‌మెంట్‌లో తలుపులు తీసి ఇంట్లోకి మేము వెళ్లి టేబుల్ మీదున్న వస్తువులు బయటకు తెస్తున్నా పట్టించుకోలేదని, మరొక కానిస్టేబుల్ వేరొక అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి లోపలి తలుపులు తీస్తున్నా అరగంటసేపు కూడా పట్టించుకోలేదని తెలిపారు. ఇంట్లో అందరూ ఉండి కూడా పట్టించుకోకపోవడంతో డిఎస్‌పి తన సిబ్బందితో అపార్ట్‌మెంట్ వాసులను కలిసి పట్టపగలే అనుమానితులు ఎవరైనా లోపలకి వస్తున్నారా లేదా అనేది గమనించకుండా మీపాటికి మీరు టివీలు చూస్తూ కూర్చోవడవం బాగలేదని సూచించారు. ఇకనైనా దొంగతనాలు జరుగుతున్నాయనడానికి తగు జాగ్రత్తలను అపార్ట్‌మెంట్ వాసులందరూ కలిసి వాచ్‌మెన్‌లను నియమించుకుని లోనికి వచ్చి పోయేవారిని తప్పనిసరిగా గమనించాలని చెప్పారు. డిఎస్పీ ఆకస్మిక పర్యటనతో మాగుంట లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే డిఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం వలన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రతిఒక్కరూ పోలీస్‌వారిని ప్రశంసిస్తూ ఇకపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment