online marketing

Friday, November 27, 2009

ఆర్టీసీ బస్సు బోల్తా

నెల్లూరు:మండల పరిధిలోని ఆమంచర్ల సమీపానగల కనుపూరు కాలువపైగల వంతెన వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను తప్పించబోయి ఆర్టీసి బస్సు 42 అడుగుల లోతుగల కాలువలో పడి డ్రైవర్‌, కండక్టర్‌లతో సహా పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం మేరకు నెల్లూరు నుండి చేజర్లకు 37 మంది ప్రయాణీకులతో మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో బయలుదేరిన ఆర్టీసి బస్సు నెల్లూరు రూరల్‌ మండల పరిధిలోని ఆమంచర్ల గ్రామం వద్ద గల కనుపూరు కాలువ వంతెనపైకి వచ్చేసరికి 1.20 గంటల సమయంలో ఎదురుగా టిప్పర్‌ రావడంతో దానికి తగలకుండా వెళ్లేందుకు ఆర్టీసి బస్సు డ్రైవర్‌ ప్రయత్నించాడు. అయితే రెండు వాహనాలు సగభాగం దాటిన తర్వాత ఒక్కసారిగా టిప్పర్‌ డ్రైవర్‌ ఎడమ వైపునకు మలుపు తిప్పడంతో, ఇంజన్‌ మాత్రం తప్పించుకుని టిప్పర్‌ వెనుకగల బాడి ఆర్టీసి బస్సును విసురుగా నెట్టివేయడంతో ఆర్టీసి బస్సు వంతెన పిట్టగోడను సైతం పగులగొట్టుకుని కాలువలో పడిపోయింది.

అయితే ఆర్టీసి బస్సు టైరు పంచర్‌ అవడం వలన అదుపుతప్పి కాలువలో పడిందని మరో వాదన వినిపిస్తుంది. కాలువలో దిగి బస్సును పరిశీలించిన కొంతమంది సహాయక సిబ్బంది మాత్రం బస్సు టైర్లు పంచర్‌ అయిన దాఖలాలు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసి బస్సు డ్రైవర్‌ ఆదిశేషయ్య తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. కండక్టర్‌ రంగనాయకులు తలకు గాయమై చికిత్స పొందుతున్నాడు. మానస అనే డిగ్రీ విద్యార్థిని తీవ్రంగా గాయపడి నగరంలోని బొల్లినేని హాస్పిటల్‌లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో నగరంలోని వివిధ ప్రైవేట్‌ ఆసుపత్రులు, నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో పి.కృష్ణమ్మ, ఎన్‌.శారదమ్మ, ఎన్‌.రామ్మూర్తి, ఎన్‌.తిరుపతమ్మ, జె.సుమలత, ఎస్‌కె.రజియా, ఎస్‌కె. ఖాదర్‌బీ, జె.అనసూయ, ఎం.అంకయ్య, ఎ.తనూజ, కె.హరిత, యు.శ్రీనివాసులు, పి.లచ్చమ్మ, డి.రమణమ్మ, మానసలు గాయపడ్డారు. ఆర్టీసి సిబ్బంది మినహా 19 మంది క్షతగాత్రులుకాగా 9 మంది తీవ్రంగాను, మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. స్వల్పంగా గాయపడ్డవారు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేయించుకుని వెళ్లిపోయారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, ఆర్టీసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నెల్లూరు ఆర్డీఒ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రమాద స్థలిని పరిశీలించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. రూరల్‌ సిఐ వై.జయరామసుబ్బారెడ్డి, ఎస్‌ఐ ఎం.రోశయ్యలు తమ సిబ్బందితో హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.



తన బ్యాగు దొరికేవరకు చికిత్సకు రానన్న క్షతగాత్రుడు

పొదలకూరులో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం.అంకయ్య తన కుమార్తె వివాహ నిమిత్తం నెల్లూరులో తయారు చేయించిన ఒకటిన్నర లక్షల రూపాయల విలువగల బంగారు ఆభరణాలను తీసుకుని గురువారం మధ్యాహ్నం ఇదే బస్సులో నెల్లూరు నుండి పొదలకూరుకు బయలుదేరాడు. అయితే ఈ బస్సు కాలువలో పడిపోవడంతో నగలతో కూడిన బ్యాగు గల్లంతయింది. దీంతో ఖిన్నుడైన ఎం.అంకయ్య తీవ్రంగా గాయపడి తన ఎడమచేయి విరిగిపోయివున్న పరిస్థితిలో సైతం వైద్యం కోసం 108 సిబ్బంది, స్థానికులు అంబులెన్స్‌లోనికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నా కూడా తాను రానని మొండి కేశాడు. తన కుమార్తె వివాహం కోసం చేయించిన నగలను వెతికి ఇస్తేనే తాను వైద్యానికి వస్తానని అంత బాధలోనూ వ్యక్తం చేయడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం మినహా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. చివరకు పొదలకూరుకు చెందిన అంకయ్య సన్నిహితులు నచ్చచెప్పడంతో వైద్యం కోసం ఆయన 108 అంబులెన్స్‌ ఎక్కారు.


మిట్టమధ్యాహ్నం ఆర్తనాదాలు, హాహాకారాలు

నెల్లూరు నుండి గురువారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో చేజర్లకు బయలుదేరిన ఒకటవ డిపోకు చెందిన ఎపి11జడ్‌156 నెంబర్‌ గల ఆర్టీసి బస్సు సరిగ్గా 1.20 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. బస్సు వంతెనపై నుండి కాలువలో పడుతున్న సమయంలో ప్రయాణీకులు ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. సమీప పొలాల్లో పనులు చేసుకుంటున్న ఆమంచర్ల గ్రామ రైతులు, స్థానికులు సత్వరమే స్పందించి ఉరుకులు, పరుగులమీద ప్రమాద స్థలికి చేరుకుని సగభాగం నీటిలో మునిగివున్న బస్సు అద్దాలను పగులగొట్టి చాలామంది ప్రయాణీకులను బయటకు తీసుకురాగలిగారు. ఇంతలో పొదలకూరుకు చెందిన అగ్నిమాపక వాహనం ఇక్కడకు చేరుకోవడంతో సంబంధిత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో నెల్లూరు రూరల్‌ పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేసి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


వైద్య ఖర్చులను భరిస్తున్న ఆర్టీసి

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అవసరమైన వైద్యాన్ని వారు కోరిన ఆసుపత్రిలో తమ ఖర్చుతో అందిస్తామని ఆర్టీసి ఆర్‌ఎం శేషగిరిరావు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రభాకర్‌రెడ్డిలు వెల్లడించారు. ప్రమాదస్థలికి చేరుకున్న వీరు అక్కడ పరిస్థితులను విశ్లేషించి కారణాలను అన్వేషించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి బంధువుల కోర్కె మేరకు వారు కోరిన హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh