Tuesday, November 24, 2009
విషజ్వరాల నివారణకు ప్రణాళికలు ఏర్పాటు - కాకాణి
నెల్లూరు:జిల్లాలో వర్షాకాలం సందర్భంగా విషజ్వరాలు సోకకుండా ఆరోగ్య కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు తయారు చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన చాంబర్‌లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రోగులకు అందిస్తున్న సేవలు, ఇమ్యునైజేషన్, పిహెచ్‌సిల నిర్వహణపై ఆయన సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సకాలంలో వైద్యం, అవసరమైన మందులిచ్చి ఆదుకోవాల్సిన డాక్టర్లు, సిబ్బంది కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు సక్రమంగా నిర్వర్తించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వైద్యులు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తూ తేదీలేని సెలవు కాగితాలు పెట్టి వెళ్తున్నారని ఆరోపించారు. అలాంటి పిహెచ్‌సిలపై ఆకస్మిక తనిఖీలు జరిపి సంబంధిత వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో ఖాళీగావున్న ఎఎన్‌ఎం, స్టాఫ్ నర్సుల ఖాళీలను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. జిల్లాలోని 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగావున్న పోస్టులు భర్తీ చేయడంతోపాటు పరీక్షలకు అవసరమైన పరికరాలను సమకూర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడంలో గ్రామసర్పంచ్‌లు, కార్యదర్శుల సమన్వయంతో తగిన ప్రణాళికులు తయారు చేసుకోవాలన్నారు. అదేవిధంగా వ్యాధి నిరోధక మందులు సక్రమంగా వాడుతున్నారా అనే విషయమై తనిఖీలు నిర్వహించి తగిన నివేదికలు అందజేయాలని సూచించారు. దోమలవల్ల వ్యాధులు సోకకుండా నిర్దేశించిన క్లోరినేషన్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేలా చూడాలని, ఈ ప్రక్రియలో మండల పరిషత్ అధికారులతో సమీక్షలు నిర్వహించి వారానికోసారి సంబంధిత నివేదికలు తీసుకోవాలన్నారు.దోమల నివారణకు అన్ని మండల కేంద్రాల్లో ఫాగింగ్ మిషన్లు పంపిణీ చేశామని, అవి సక్రమంగా ఉపయోగపడుతున్నాయా అనే విషయమై సమగ్ర దర్యాప్తు నిర్వహించి సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ, సై్వన్‌ఫ్లూ తదితర ప్రాణాంతక వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సెమీ ఆటో అనలైజేషన్ పరికరాన్ని అమర్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్ ద్వారా వివిధ సంక్షేమ పథకాల కార్యక్రమాల పనితీరును ప్రతిరోజూ మండల పరిషత్ అధికారులతో సమీక్షించేందుకు వీలుగా వైర్‌లెస్ సెట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో వైద్యాధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఒ ఆంజనేయరాజు, జిల్లా ఇన్‌చార్జ్ వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జయసింహ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కనకాద్రి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment