online marketing

Tuesday, November 24, 2009

అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్‌

నెల్లూరు : నగరంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారి వాహనదారులకు పలు ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. దీనికి తోడు విపరీతమైన వర్షాల వల్ల రోడ్లు గుంతలు పడడంతో ద్విచక్ర వాహనదారులు ముందు పోతున్న వాహనాలను తప్పించబోయి గుంటల్లో పడి అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. మేమేం తక్కువా అన్నట్లు నగరంలో ఉన్న ఆటోలు, టౌన్‌ సర్వీస్‌లు ప్రయాణీకులు ఎవరైనా చెయ్యెత్తితే చాలు వెనుకా ముందు చూసుకోకుండా బ్రేక్‌ కొట్టడంతో వెనుక వస్తున్నవారు ఢీకొని ఆసుపత్రి పాలవుతున్నారు. నగర కూడళ్లలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌ కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి. సిగ్నల్స్‌ వద్ద పోలీసులు డ్యూటీ చేస్తున్నప్పటికీ వారు చేసే డ్యూటీ ఎప్పుడు అయిపోతుందా, ఇంటికెళ్లిపోదామా అన్నట్టుంది గాని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశ్యం కనిపించడంలేదు. ముఖ్యంగా కెవిఆర్‌. పెట్రోల్‌ బంకుకు ఆనుకుని పలు కళ్యాణ మండపాలు ఉండడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకిరువైపులా వాహనాలను ఉంచడంతో పొదలకూరు రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు, నగరంలో నుండి అటువైపు వెళ్లే వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారుతోంది. ఇంత ట్రాఫిక్‌ జామ్‌ అయినా అక్కడ పట్టించుకునే నాధుడే కరువవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైరన్‌ మోగించుకుంటూ నగరంలో ‘మాకు దారి వదలండి’ అన్నట్లు సైరన్‌ మోగించుకుంటూ వెళ్తున్నారే తప్ప వారి కళ్ల ముందే ఎక్కడ పడితే అక్కడ ఆపిన వాహనాలను చూసి కూడా పట్టించుకోవడం లేదు. దీనికి తోడు అధికారులు నగరంలోకి వచ్చే రాజకీయ నాయకుల సేవలో మునిగితేలుతున్నారేతప్ప ట్రాఫిక్‌ గురించి పట్టించుకోవడం లేదు. ఇక ట్రాఫిక్‌ ఎస్‌ఐలు పెన్ను, పుస్తకం తీసుకుని బిజి బిజీగా వచ్చే పోయే వాహనాలపై కేసులు రాసుకోవడం తప్ప ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో విఫలమవుతున్నారు. గతంలో ప్రతి స్టేషన్‌కు సంబంధించిన లా అండ్‌ ఆర్డర్‌ ఎస్‌ఐలు ప్రతి రోజూ సాయంత్రం తమ పరిధిలో ట్రాఫిక్‌ను క్లీర్‌ చేయడం, జరిమానాలు విధించడం వంటివి ఉండేవి. నేడు నగరంలోని ప్రతి ఎస్‌ఐ అధికారుల, రాజకీయ నాయకులకు సేవలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ ట్రాఫిక్‌పై చూపించడంలేదు. నగర డిఎస్‌పి కొత్తగా చార్జి తీసుకున్న తదుపరి నగరంలోని టౌన్‌సర్వీసులు, ఆటోలు, మద్యం సేవించి వాహనం నడుపుతున్నవారిపై కొరడా ఝళిపించారు. అదేదో సామెతలాగా ఎక్కడైనా అధికారి వచ్చిన కొత్తల్లో తమ ఉనికి తెలుపుకోవడం కోసం ఢూం ఢాం అని అరవడం, బెదరగొట్టడం మామూలే అన్నట్లుగా డిఎస్‌పి సైతం నేడు ట్రాఫిక్‌ గురించి పట్టించుకోవడం లేదు. నగర డిఎస్‌పి నగరానికి వచ్చి ఇప్పటికి సుమారు 8 నెలలు అయినప్పటికీ కొత్తలో ఉన్న స్పీడు నేడు తగ్గింది. మరి డిఎస్‌పి స్పీడు తగ్గడానికి కారణాలు ఏవో పరమాత్ముడికే ఎరుక. ఏది ఏమైనప్పటికీ అస్తవ్యస్తంగా మారిపోయిన ట్రాఫిక్‌ను, దద్దరిల్లిపోయే హారన్‌ మోతలు, ఎక్కడపడితే అక్కడ ఆపే ఆటోలు, బస్సులను గురించి అధికారులు పట్టించుకొని సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh