Tuesday, November 24, 2009
పోస్టుమ్యాన్ ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: తపాలాశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారి వేధింపులతో ఓ పోస్టుమ్యాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మండలంలోని దేపూరు గ్రామంలో జరిగింది. బాధితుని, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దేపూరు గ్రామంలో పూజారి శేషాద్రి గత కొన్ని సంవత్సరాలుగా పోస్టుమ్యాన్‌గా పని చేస్తున్నాడు. ప్రభుత్వం ఇటీవల తపాలాశాఖ సిబ్బందికి కొన్ని సంవత్సరాలుగా నిల్వ ఉన్న అరియర్స్‌ను మంజూరు చేసింది. దీంతో శేషాద్రికి సుమారు 14 వేల రూపాయలు రావాల్సి ఉంది. ఆ నిధులు ఇవ్వాలంటే ఉన్నతాధికారుల ఆదేశం తప్పని సరి. ఈ నేపథ్యంలో శేషాద్రి ఆత్మకూరులో పని చేసే ఓ ఉన్నతాధికారిని తనకు వచ్చే అరియర్స్‌ను మంజూరు చేయాలని కోరారు. దీంతో ఆ అధికారి తనకు కొంత నగదును ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.శేషాద్రి ఉన్నతాధికారి అడిగిన మొత్తాన్ని ఇవ్వలేక అందులో కొంత మొత్తాన్ని అధికారికి సమర్పించుకున్నాడు. అయితే ఆ ఉన్నతాధికారి శేషాద్రికి రావాల్సిన అరియర్స్ మొత్తాన్ని ఇవ్వలేదు. తాను అడిగిన నగదు ఇస్తేనే నీకు రావాల్సిన అరియర్స్ ఇస్తానని ఉన్నతాధికారి శేషాద్రితో కరాకండిగా చెప్పాడు. దీంతో ఆదివారం ఉదయం నిద్రమాత్రలు తెచ్చుకుని మింగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు శేషాద్రి. ఈ విషయాన్ని తన భార్య, బిడ్డలతో సైతం చెప్పుకొచ్చాడు. నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్న శేషాద్రిని చూసిన భార్య లబోదిబోమంటూ స్థానికులకు చెప్పింది. ఈ విషయాన్ని 108 సిబ్బందికి తెలియజేయడంతో ఆత్మకూరు 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు మాత్రలను కక్కించి శేషాద్రికి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ విషయమై శేషాద్రి ఆత్మకూరులో పని చేసే ఉన్నతాధికారి వేధింపులే నా ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు స్పందించి నాకు న్యాయాలంటూ కోరారు. మొత్తానికి సకాలంలో 108 వాహనం వైద్యశాలకు చేర్చడంతో శేషాద్రి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరి ఈ సంఘటన తపాలాశాఖ జిల్లా అధికారులు ఎలా స్పందింస్తారో... శేషాద్రికి ఏ మేరకు న్యాయం జరుగుతుందో.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment