Tuesday, November 24, 2009
జ్వరమేలే అనుకుంటే...
నెల్లూరు:జ్వరం...జలుబు...దగ్గు... ఇలాంటి వ్యాధులంటే గతంలో అసలు భయపడాల్సిన పనేలేదు. కేవలం క్యాన్సర్, గుండె, లివర్ తదితర వ్యాధులంటేనే అమ్మో అనుకునే పరిస్థితులు పోయాయి. భయంకరమైన ప్రాణాంతక వ్యాధులైనా ప్రస్తుతం నయమవుతున్నాయేమోగాని ఏముందిలే అనుకునే జ్వరం, జలుబు, దగ్గులు నేడు ఎంతో విలువైన ప్రాణాలను హరించి వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జలుబు, దగ్గుల కారణంగా ‘సై్వన్ ఫ్లూ’ అనే మహమ్మారి దేశవ్యాప్తంగా ఎందరి ప్రాణాలను బలిగొన్నదో ప్రజలకు తెలియంది కాదు. ఇక జ్వరం విషయానికొస్తే కనీసం డాక్టర్ల వద్దకు వెళ్లకుండా, మాత్రలు వేసుకోకుండానే తగ్గపోయే పరిస్థితులు లేకపోలేదు. కాదు కూడదు అనుకుంటే కనీసం మందులషాపులకెళ్లి జ్వరం, తలనొప్పి, వళ్లు నొప్పులు అని చెప్పి వారిచ్చే ఒకటి రెండు మాత్రలకు తగ్గిపోయే పరిస్థితులు తెలియందికాదు. అయితే ప్రస్తుతం డెంగ్యూ, మెదడువాపు, చికున్‌గున్యాలతోపాటు పలు విషజ్వరాలు ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి వృద్దుల వరకు లింగ భేదాలు లేకుండా ప్రాణాలను తీస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. నాకు ఉగ (ఊహ) తెలిసినప్పటి నుంచి ఆసుపత్రికి అంటూ వెళ్లి ఎరుగను అని చాలామంది అంటుంటే వింటుంటాం. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది.ఈ జ్వరాలకు పేద, గొప్ప అనే తేడా ఏమాత్రం లేదనేది స్పష్టమవుతోంది. జ్వరమేకదా అనుకుంటే నిన్న మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ, మన కళ్లెదుటే ఉన్న కుటుంబ సభ్యులొకరు నేడు ఈ మాయదారి జ్వరం మూలాన లోకాన్ని విడిచి వెళ్లారంటే ఆ బాధ సంబంధిత కుటుంబానికే తెలుస్తుంది. ఈ మాయదారి జబ్బులకు కలుషితమైన నీరు, దోమలు ప్రధాన కారణమవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ వ్యాధులకు ప్రజలు బలవుతున్నారని టివిలు, పత్రికల ద్వారా వార్తలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం కాకిలెక్కలు చెబుతూ మీన మేషాలు లెక్కబెడుతుంది. అధికారులు తాము వ్యాధులను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని చెబుతుండడం హాస్యాస్పదంగా తయారవుతుంది. ప్రజల నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వారికి కనీస వసతి సౌకర్యాలు కల్పించడం అటుంచి వారి ప్రాణాలను హరించివేస్తున్న దోమల నివారణకు, కలుషితం కాని తాగునీటిని అందించే విషయంలో మున్సిపాలిటీ, నగర పాలక సంస్థ, పంచాయతీలు ఘోరంగా విఫలం చెందుతున్నాయి. ముఖ్యంగా ఈ జ్వరాల విషయంలో నిరక్షరాస్యుల సంగతి అటుంచితే చదువుకున్నవారు సైతం రెండు మూడు రోజులపాటు ఏదో ఒకటి అరా మందులు వాడి తీరా వ్యాధి ముదిరి ప్లేట్లెట్ల సంఖ్య భారీగా పడిపోతేగాని తేరుకోవడం లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ స్థితిలో స్థానిక వైద్యులు తాము చేయాల్సింది అంతా చేశాం... ఇక మా వ ల్ల కాదు అంటూ చేతులెత్తేస్తున్నారు. తీరా ఆగమేఘాలపై సంబంధిత రోగిని తీసుకుని చెనై్న, తిరుపతి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్తే అదృష్టం బాగుండి సకాలంలో వైద్యసేవలు అందితేసరి లేకుంటే హరీ. ముఖ్యంగా ఇటీవల కాలంలో జిల్లాలో డెంగ్యూ వ్యాధి బారినపడి దాదాపు పది మంది వరకు చనిపోగా వందలాదిమంది పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంలా బతికి బయటపడ్డారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అప్పటికీ వారంతా వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని కాస్తా అటు ఇటుగా సకాలంలో వైద్యం పొందడంతో హమ్మయ్య అనిపించుకోగలిగారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎల్‌వి.సుబ్రహ్మణ్యం, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఒంటేరు దశరధరామిరెడ్డి, అంటు వ్యాధుల నివారణ సంయుక్త సంచాలకులు డాక్టర్ డి.మధుసూదన్ వంటి రాష్టస్థ్రాయి ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాను సందర్శించి వెళ్లినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. నగరంలో పారిశుద్ధ్య వారోత్సవాల పేరుతో నగరపాలక సంస్థ అధికారులు పలు పారిశుద్ధ్య పనులు చేపట్టినా నగరంలో దోమల మోత ఇంకా అలాగే కొనసాగుతోంది. తాజాగా నగరంలోని కొండాయపాళెం ప్రాంతానికి చెందిన క్ష్మీ ధీరజ(12) అనే బాలిక డెంగ్యూ వ్యాధికి గురై మరణించింది. వారి తల్లిదండ్రులకు ఆ బాలిక ఒక్కటే కూతురు కావడంతో ఆమె మరణంతో వారు కుప్పకూలిపోయారు. కని, పెంచి కళ్లముందే కన్నకూతురు కన్నుమూయడంతో ప్రస్తుతం వారి బాధను తీర్చి, ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. రాజకీయ నేతలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తూ అది చేస్తాం... ఇది చేస్తాం... మా జీవితం ప్రజాసేవకే అంకితం... అంటూ చెబుతున్న మాటలు నీటి మూటల్లాగే మిగులుతున్నాయని, ఈ దోమలు, కలుషితమైన నీరు మరిన్ని ప్రాణాలను హరించేలోగా పాలకులు స్పందించి తమను కాపాడాలంటూ జిల్లా ప్రజానీకం వేడుకుంటోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment